AB MASILAMANI garu (ఎ.బి. మాసిలామణి గారు) జన్మదినం 30/11/1914
సార్వత్రిక సంఘానికి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన సేవ అనిర్వచనీయం. ఒకే సమయంలో పండితులకు పామరులకు అర్ధమయ్యే విధంగా వాక్యాన్ని బోధించడం ఆచార్యుల వారి ప్రత్యేకత. తక్కువ సమయంలో ఎక్కువ వాక్యాలను ఉటంకించి బోధించడంలో ఆయనే మేటి. ఆయన కంఠ స్వరం ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆయన మాటలు మనసుని అల్లుకుపోయె లతలు. క్రీస్తు ప్రేమను సుస్పష్టంగా, సవివరంగా శ్రోతల ఎదుట సునాయాసంగా ప్రదర్శించే ప్రజ్ఞాశాలి.
మాసిలామణి గారి "దేవుని ప్రేమ" అనే ప్రసంగంలో నాకు నచ్చిన కొన్ని మాటలు..
“దేవుడు మానవ ప్రేమికుడన్న సత్యాన్ని పటిష్టం చేయడానికే యేసు నామావతారునిగా చరిత్రలో రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు కాలు మోపాడు. ప్రేమ జీవన అనంతపాశం అని క్రీస్తు ప్రభోధించాడు, దివ్య ప్రేమను ఆయన ప్రదర్శించాడు, ఆ ప్రేమ కానుకను లోకానికి ప్రసాదించాడు. శిశువు జన్మించినప్పుడు బొడ్డు కోయుట ద్వారా శిశువునకు ఒక ప్రత్యేకతను ఆపాదించడం మాత్రమే గాకుండా, మాతాశిశువుల అనన్యతకు అంతరాయం కలిగిస్తాము. రక్తబంధాన్ని ఆలా తెంపి వేయగలిగినా, పిండోత్పత్తి మొదలుకొని మాతాశిశువులను పెనవేసుకొనుచున్న ప్రేమబంధాన్ని తెంపివేయలేము గదా? ఈ ప్రేమ ఒక అలౌకిక శక్తిగా తల్లిని పిల్లను ఆమరణాంతం బంధిస్తూ చివరికి మరణాన్ని కూడా అధిగమించి దివ్య ప్రేమలో విలీనం అయిపోతుంది. ఇదే సంబంధం దేవునికి మానవునికి ఏర్పడింది. దేవుడు మానవుని సృష్టించాక అతనికి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రసాదించాడు. మానవుడు స్వేఛ్ఛా జీవయ్యాడు. ఐఛ్ఛికంగా దేవుని ఆరాధింపగలడు లేదా ఆయనను ఎదురాడగలడు. ఈ విధంగా దేవునికి నరునికి వ్యక్తిత్వ భేదం ఏర్పడినా, దేవుని ప్రేమలో పుట్టిన మానవుని పెనవేసుకున్న ఆ ప్రేమబంధం అభేద్యంగా ఉండిపోయింది. నరుని రక్షణార్ధం, అతని అభ్యుధయం కోసం దేవుడు నరావతారం ఎత్తడానికి ప్రేమయే కారణం. ఆ ప్రేమ రూపమే యేసుక్రీస్తు."
***
ఆయన రచించిన పాటలు ఇప్పటికి అందరి హృదయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనవి..
“భాసిల్లెను సిలువలో పాపక్షమ”
“నడిపించు నానావ – నడిసంద్రమున దేవ”
“అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో”
“కరుణారసభరితా యెహోవా యేసావతారా ప్రభో”
“హేప్రభు యేసు – హేప్రభు యేసు”
“రండి సువార్త సునందముతో – రంజిలు సిలువ నినాదముతో”
“దేవుని వారసలం – ప్రేమనివాసులం”
“ప్రభుప్రేమ తొలికేక – హృదయంలో ప్రతిద్వనించె”
“జీవాహారము రమ్ము – చిరజీవాన్నము నిచ్చి”
“దేవా వెంబడించితి నీనామమున్ – జీవితేశ్వరా నాజీవితాశ నీవే”
నా బాల్యం నుండే ఆయన ప్రసంగాలను రేడియోలో వింటు ఎదిగాను. మాసిలామణి గారి జీవితం మరియు సేవ అనే ఈ క్రింది వీడియోను దయచేసి చూడండి.
దేవుడైన క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి అపూర్వ సేవలందించి ప్రభు సన్నిధిలో ఉన్న ఆచార్య ఎ.బి. మాసిలామణి గారి జ్ఞాపకార్థం నా ఈ కొన్ని మాటలు. ఈ గొప్ప దైవజనుని నిస్వార్థ సేవకై దేవునికి స్తోత్రాలు.
ఎ.బి. మాసిలామణి గారు 1990లో ఏప్రియల్ 5వ తేదిన ప్రభువు సన్నిధికి చేరుకున్నారు.
మాసిలామణి గారు ఇచ్చిన కొన్ని ప్రసంగాల కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
https://youtu.be/wAJzku0tJ3U
Comments
Post a Comment